పక్కా ప్రణాళికతో సిఎం పర్యటన ఏర్పాట్లు చేయండి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

పక్కా ప్రణాళికతో సిఎం పర్యటన ఏర్పాట్లు చేయండి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
నంద్యాల జిల్లా ఏప్రిల్ 06: తెలుగు వార్త
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు చేపట్టిన పనులన్నీ గురువారం మధ్యాహ్నంలోగా పూర్తి
చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో సియం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా మొట్ట మొదటి పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రోటోకాల్ ప్రకారం అప్పగించిన పనులు పక్కా ప్రణాళికతో చేపట్టి రేపు
మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సియం పర్యటించే 1.5 కి.మీ రహదారి పారిశుద్ధ్య పనులు, నగర సుందరీకరణ పనులు ఆకర్షణీయంగా
ఆకట్టుకున్నరీతిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణను ఆదేశించారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజానీకానికి త్రాగు నీటి వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
డిగ్రీ కాలేజీలో హెలిపాడ్ మైదానంలో, ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగసభ ప్రాంగణాల్లో వాటరింగ్ పెద్దఎత్తున చేయాలని అగ్నిమాపక అధికారిని ఆదేశించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మూడు జనరేటర్ లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని
ఏపీఎస్పిడిసిఎల్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ వేదిక సమీపాల్లో సేఫ్ రూములు ఏర్పాటు చేసుకొని అత్యవసర మందులతో సిద్ధంగా వుండాలని డిఎంహెచ్ఓ, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభ వేదిక సమీపంలోని విద్యా, వసతి దీవెన, గ్రూప్ ఫోటో తదితర స్టాల్స్ ని కోఆర్డినేట్ చేసుకోవాలని డ్వామా పిడిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సీఎం పర్యటించే ప్రదేశం, సభా ప్రాంగణాల వద్ద స్పందన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హెలిపాడ్ మైదానాన్ని, ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగసభ వేదిక ప్రదేశాలను పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్ పి కె. రఘువీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో జేసీ (ఆసరా మరియు సంక్షేమం) ఎంకెవి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.