30వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం..!
తెలుగు వార్త న్యూస్

30వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం..!
శ్రీశైలం, మార్చి 24, (తెలుగు వార్త న్యూస్) :
మార్చి 30 వతేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహింపబడనున్నాయి. ఉగాది మహోత్సవాలలో సుమారు వారం ముందు నుంచే కర్ణాటక మరియు మహారాష్ట్రలలోని పలుప్రాంతాల భక్తులు క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ కారణంగా గురువారం నుండి 30వ తేదీ వరకు అనగా వారం రోజులపాటు భక్తులందరికీ శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించబడుతోంది.ఈ వారం రోజులలో (మార్చి 24 నుంచి ఈ నెల 30వ తేదీ వరకు) ఉచిత దర్శనంతో పాటుశీఘ్రదర్శనానికి (రూ. 500/-రుసుముతో) కూడా అవకాశం కల్పించబడింది.భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా రద్దీని బట్టి స్పర్శదర్శనానికి అధిక సమయం పడుతోంది.క్యూకాంప్లెక్స్ లో దర్శనానికి వేచివుండే భక్తుల సౌకర్యార్థమై మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం (పులిహోర, కట్టుపొంగలి మొదలైనవి) నిరంతరం అందజేయబడ్డాయి. అదేవిధంగా క్యూలైన్లలో కూడా నిరంతరం
త్రాగునీటిని అందజేయడం జరిగింది.
కాగా ఉత్సవాలలో రెండవ రోజైన మార్చి 31వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే ఏప్రియల్ 3వ తేదీ వరకు
భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకారదర్శనం మాత్రమే కల్పించబడుతుంది.కాగా గురువారం (24.03.2022) నుంచి 30 వతేదీ వరకు శ్రీ స్వామివారి గర్భాలయ ఆర్జిత అభిషేకం పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది.ఈ రోజులలో రూ.1500/-ల సేవారుసుముతో నిర్వహించబడే అభిషేకాలు శ్రీ వృద్ధమల్లికార్జునస్వామి వారికి జరిపించబడుతున్నాయి. ఈ అభిషేక సేవాకర్తలకు కూడా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పించబడుతుంది.
అదేవిధంగా ఈ వారం రోజులలో అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీవల్లీదేవసేనా సమేత
సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణాలు కూడా యథావిధిగా జరిపించబడుతున్నాయి.ఉత్సవాలలో రెండవ రోజైన మార్చి 31వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే ఏప్రియల్ 3వ తేదీ వరకు స్వామివారి గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, వృద్ధమల్లికార్జునస్వామివారి ఆలయంలో నిర్వహించబడే ఆర్జిత అభిషేకాలు కూడా పూర్తిగా నిలుపుదల చేయబడుతాయి. కుంకుమార్చన మరియు కల్యాణోత్సవాలు మాత్రం ఉత్సవాల సమయాలలో కూడా యథావిధిగా జరిపించబడుతాయి.