విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి

డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి
జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
కర్నూలు, జూలై 21: డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో మత్తు పదార్థాల నియంత్రణపై సెబ్ అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తో పాటు సంబంధిత శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, వాటి వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకొని వారు ఇక్కడ చదువులు పూర్తి చేసుకొని ఉన్నత చదువులు చదవడానికి వేరే యూనివర్సిటీలకు వెళ్లినా డ్రగ్స్ కి ప్రభావితం కాకుండా ఉంటారని అందుకు తగిన అవగాహన సదస్సులు అన్ని పాఠశాలలో మరియు కళాశాలలో ఏర్పాటు చేయాలని సంబంధిత విద్యాశాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల యందు మత్తుపదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలను సూచిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. గత సమావేశంలో చర్చించిన దానిమీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సంబంధిత వైద్యాధికారులను ఆరా తీయగా, మెడికల్ ఆఫీసర్ తో ప్రతి పీహెచ్సీ కేంద్రంలో ఉన్న సిబ్బందికి మాదకద్రవ్య వ్యసనం యొక్క లక్షణాలను గుర్తించడానికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇంతవరకు అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించలేదని తెలిపారు. అటువంటి లక్షణాలు ఉన్న వారిని ఎవరినైనా గుర్తించినట్లయితే వారిని కౌన్సిలింగ్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డి ఆడిక్షన్ సెంటర్ కి పంపించే వారి వివరాలను సెబ్ కార్యాలయముకు కూడా పంపాలని డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నోడల్ అధికారి, ఎస్టీ/ఎస్సీ సెల్ డిఎస్పీ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్య అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా మెడికల్ షాపుల నందు కూడా మత్తుకు సంబంధించిన మందులు ఇచ్చే సమయంలో సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా నిజంగా ప్రిస్క్రిప్షన్ ఉన్న పేషంట్స్ కి మాత్రమే ఇస్తున్నారో లేదో చూసుకోవాలని అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్ ని అదేశించారు.అదే విధంగా బస్సులలో పార్సెల్ సర్వీసుల ద్వారా రవాణా చేసే వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా అని ఆర్టీసి ఆర్ఏంను ఆరా తీయగా పార్సల్ కు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ శాఖ నుండి ఎవరైనా వచ్చి వాటిని ఏ విధంగా కనిపెట్టొచ్చో బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తే బాగుంటుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.