
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి
ఒంగోలు (తెలుగు వార్త)
కుల రహిత సమాజం కోసం… అంటరానితనం నిర్మూలన కోసం.. అణగారిన వర్గాల హక్కుల కోసం.. వారి అభ్యున్నతి కోసం తుది శ్వాస వరకు పోరాడి ..వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహా మనిషి.. ప్రపంచం గర్వించదగిన విద్యావేత్త.. న్యాయశాస్త్ర కోవిదులు.. సంఘ సంస్కర్త ..భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు. శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మిడసల మల్లికార్జునరావు.. కనమాల రాఘవులు ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక సివియన్ రీడింగ్ రూం ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి లలితకళా అకాడమీ అధ్యక్షులు డాక్టర్ సంత వేలూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు.. ఈ సమావేశంలో శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతిపాదిత సిద్ధాంతాలను అమలు చేయడం ద్వారా సమాజంలో ఇప్పటికీ నెలకొని ఉన్న ఆర్ధిక సాంఘిక సామాజిక అసమానతలను తగ్గించ వచ్చన్నారు… సాహితీ పోషకులు మెడబలిమి సాంబశివరావు మాట్లాడుతూ తన మేధో సంపత్తి ద్వారా అట్టడుగు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు..
ఈ కార్యక్రమములో వివిధ సాంస్కృతిక కళా సంస్థల ప్రతినిధులు షేక్ మహబూబ్ జాన్, గుంటూరు సత్యనారాయణ, చిడితోటి బాబూరావు, .కొప్పోలు వెంకటేశ్వర్లు చీదర్ల ఏడుకొండలు దాసరి సురేష్, పి.పుల్లారెడ్డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు