
కురుకుంద గ్రామంలో…. సీతారామచంద్ర మూర్తి స్వామివారి కళ్యాణ మహోత్సవం.
================================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు రూరల్.
ఆత్మకూరు మండల పరిధిలోని కురుకుంద గ్రామం నందు శ్రీ సీతారామ చంద్ర మూర్తి స్వామి కళ్యాణ మహోత్సవ రథోత్సవం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు జరగనున్నట్లు అనువంశిక ధర్మకర్త కొండ కమలాకర్ శర్మ, నాగ ప్రసాద్ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు, ఆలయ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శుభ కృత నామ సంవత్సరం వసంత ఋతు బహుళ చవితి మొదలుకొని 20:04:2022 చైత్ర బహుళ సప్తమి నుండి 23:04:2022 వరకు శ్రీ సీతారామచంద్ర మూర్తి స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగునని, భక్తులందరూ స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని ఆశీస్సులు పొందాలని, దైవానుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరారు. బుధవారం రాత్రి 8 గంటలకు శ్రీ సీతారామచంద్ర మూర్తి కళ్యాణ మహోత్సవం తదుపరి ప్రభోత్సవం జరుగునని, గురువారం 4:30 గంటలకు రథోత్సవం జరుగునని, అనంతరం రాత్రి 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం జరగాలని, శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు పారువేట ఉత్సవం జరుగునని, శనివారం ఉదయం 8 గంటలకు తీర్థవళి తదుపరి గ్రామోత్సవం జరుగును అని తెలియజేశారు. ఈ స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొని భక్తులందరూ దైవ ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జెడ్పిటిసి జి. శివశంకర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, గ్రామ సర్పంచ్ భర్త వైసిపి నాయకులు బందెల మాబు తదితరులు పాల్గొన్నారు.